Search This Blog


Tuesday, October 5, 2010

క్లిష్టమైన నిర్ణయం

ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న అతి క్లిష్టమైన నిర్ణయమేది?
ఈ మధ్య విడుదలైన రెండు మంచి సినిమాలలో దేనికి వెళ్ళాలనా?
ఓ అందమైన సాయంత్రం డిన్నర్ కి ఏ హోటల్ కి వెళ్ళాలనా?
లేకపోతే అక్కడ మెనూలోని ఏం ఐటం ఆర్డర్ చేయాలనా?
ఏ బ్రాండ్ కారు కొనాలనా?
పోనీ మీ అబ్బాయినో అమ్మాయినో ఏ కాలేజీలో,ఏ బ్రాంచ్ లో చేర్చాలనా?
మీఇద్దరు ముద్దుల అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు ఎవరిది తప్పో నిర్ణయించడమా?
మీ అమ్మగారు,అందాలభార్య విభేదించినప్పుడు ఎవరి పక్షం వహించాలనా?
మీ ఆత్మీయులు చేసిన తప్పుకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పవలసి వచ్చిందా?ఏం చెప్పారు?
ఓ లంచగొండి అధికారి,విధిలేకో/కక్కుర్తిపడో అతనికి సహకరిస్తున్న కింది ఉద్యోగి ఇద్దరూ CBI అధికారి అయిన మీకు దొరికిపోయారనుకోండి,ఇద్దరినీ ఒకేలా చూస్తారా?
పై సందర్భాలు అన్నీ, లేకపోతే కొన్ని మనకు తటస్థపడే ఉంటాయి.
అయితే వీటిలో ఏ సందర్బంలో మీరు ఎక్కువ సమయం తీసుకున్నారు,అసలు నిర్ణయమే తీసుకోకుండా తప్పించుకున్నారా? తప్పించుకోవడం సాధ్యం కాకపోతే ఏం చేసారు? ఏదయినా నిర్ణయం తీసుకున్న తరవాత తప్పు చేసాననిపించిందా? లేక పోతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరే ఓడిపోయారనిపించిందా?
ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది.
పై వాటిలో కొన్ని కేవలం బుధ్ధి ఉపయోగించి నిర్ణయించవచ్చు,వాటి వల్ల ఏ సమస్యా లేదు. ఆ నిర్ణయం తప్పయినా పెద్దగా పోయేదేమీ లేదు. ఆ కొద్ది నష్టం ఏదో విధంగా భర్తీ చేసుకోవచ్చు.అయితే మరికొన్నిటికి మాత్రం బుధ్ధితో పాటు మనసు ను కూడా ఉపయోగించవలసి వస్తుంది,ఇక్కడే అసలు సమస్య.వీటన్నిటిలో సెంటిమెంట్ కలిసి ఉంటుంది.కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం బాపతు.మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరో ఒకరు నష్టపో వలసి వస్తుంది,ఆ నష్టపోయేవారు కూడా మనకి కావలసిన వాళ్ళయితే ఏం చేయాలి.

ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నాకు ఈ మధ్య ఇలాంటి సమస్యే ఎదురయ్యింది.ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు మరి.ఇలాంటి సందర్భాలలో మీరైతే ఏం చేస్తారు?ఎవరైనా మంచి సలహా ఇస్తారేమోనని ఆశ.

1 comment: