అంతర్జాలం మనకు ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి ఈ బ్లాగులు.తెలుగులో బ్లాగు నడపగలుగుతున్నారంటే తప్పనిసరిగా విద్యావంతులు,కాస్తో కూస్తో కంప్యూటర్ మీద పట్టు ఉన్నవాళ్ళూ,తెలుగు మీద అభిమానం, తెలుగు వారి సంస్కృతి మీద అభిమానం ఉన్న వాళ్ళూ,విజ్ఞులు అయిఉంటారని నా అభిప్రాయం.నేను బ్లాగు మొదలెట్టి నిండా సంవత్సరం కాలేదు.అయితే ఈ కొంత కాలం లోనే కొన్ని అద్భుతమైన బ్లాగులను చూసాను,అవి చూస్తే ఆ బ్లాగర్ ల అభిలాష,విషయ పరిజ్ఞానం,విషయ సేకరణ వెనుక వాళ్ళ కృషి చెప్పకనే తెలుస్తుంది.అలాంటి మేధావుల నుంచి, అనుభవజ్ఞుల నుంచి ఎంతోనేర్చుకోవచ్చనిపిస్తుంది.అది నిజం కూడా.ఆయితే దురదృష్టవసాత్తు కొన్నిసంఘటనలవల్ల కొంతమంది బ్లాగర్ల మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.ఇవి కుటుంబ సభ్యులను దూషించటం , ఆలాగే కొన్ని కోట్లమంది ఆరాధింఛే దైవాలను దూషించి, ఇతిహాసాలకు కూడా వక్రభాష్యం చెప్పే స్థాయికి చేరిపోయాయి.ఇలాంటి పోస్ట్ ల సంఖ్య క్రమేపీ పెరిగిపోతుంది.దీనివల్ల ఆ బ్లాగర్లు ఆశించినది నెరవేరుతుందోలేదో కానీ మిగిలిన బ్లాగర్ ల మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయి.వాళ్ళకు వేదన మిగిల్చుతున్నాయి.ఇదేనా భాధ్యత కలిగిన తెలుగువారినుంచి ఆశించగలిగేది. మనం మన తరవాతి తరాలకు అందించే బహుమతి ఇదా.ఇలాంటి సంఘటనలవల్ల చాట్ రూంలకి అధోగతి పట్టింది.బ్లాగులకి ఆ గతి పట్టకుండా కాపాడుకోవలసిన అవసరం ఉంది.
వాస్తవానికి ఏ యుధ్ధం లోనూ విజేత ఉండడు(దు).గెలిచినవారికి, లేదా గెలిచామనుకున్న వారికి కూడా అప్పటికే చాలా గాయాలు తగిలి ఉంటాయి.అవి నిరంతరం గుర్తుకువచ్చి వేధిస్తూనే ఉంటాయి.అందుకే యుధ్ధాన్ని నివారించటమే ఉత్తమ మార్గం,యుధ్ధం ఇప్పటికే మొదలైంది కాబట్టి తక్షణం విరమించటం మంచిది.
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః!
స్మృతి భ్రంసాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి!
(ఇది మీకందరికీ తెలిసిన శ్లోకమే,మరోసారి గుర్తుచేస్తున్నానంతే)
అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితంచయత్!
స్వాధ్యాయభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే!
(ఇతరుల మనస్సుకు భాధ కలిగించనిది,సత్యమైనది,ప్రియమైనది, మేలుకలిగించునది అయిన వాక్యము పలుకుట వేదములను, శాస్త్రములను, అభ్యసించుటవలె వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది)
బ్లాగర్లు అందరికీ ఇదే నా విన్నపం. దయ చేసి అంతా సంయమనం పాటించండి.తెలుగు బ్లాగుల ప్రతిష్ట పెంచండి.