నేను ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉంటున్నాను.ఒరిస్సా కు వెనుకపడిన రాష్ట్రం అన్న అపప్రధ ఉంది.నేనూ ఇక్కడకు వచ్చేముందు చాలా భయపడ్డాను. ఒకప్పుడు వెనుక పడి ఉండేదేమో తెలియదు కానీ,ప్రస్తుతం మాత్రం ఆంధ్రకేమీ తీసిపోదు.ప్రజలు కూడా స్నేహశీలులు.దైవ భక్తి,ఆచారాలు చాలా ఎక్కువ. నిరాడంబరులు, పొదుపరులు, అల్పసంతోషులు. అద్భుతమైన ప్రకృతి సంపద ఒరిస్సాకు ఒక వరం. ఒరిస్సా భూభాగంలో 40% వరకు అడవులు విస్తరించుకొని ఉన్నాయి.ఒరిస్సాకు మరోప్రత్యేక ఆకర్షణ చిలక సరస్సు.ఈ సరస్సు మూడు జిల్లాల(గంజాం,ఖుర్దా,పూరీ) మేర విస్తరించి ఉంది.ప్రత్యెకంగా చెప్పుకో వలసిందేమిటంటే గంజాం,ఖుర్దా జిల్లాలలో తెలుగువారి సంఖ్య అధికం.చిలక సరస్సు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.సుమారు వేయి చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది.సుమారు నూట యాభై మత్స్యకార గ్రామాలు ఈ సరస్సుపై ఆధారపడి జీవిస్తున్నాయి. చిలకా ప్రపంచ ప్రఖ్యాత పక్షుల విడిది.చలికాలంలో ఖండ,ఖండాంతరాలనుంచి లక్షల సంఖ్యలో వివిధజాతుల(సుమారు నూట అరవై జాతులు) పక్షులు ఇక్కడికి వస్తాయి.వాటిని చూడటానికి సందర్శకులు కూడా ఎక్కువగానే వస్తారు.చిలకా సందర్శించటానికి అక్టోబర్ నుంచి మార్చి నెల వరకు అనువైన సమయం. చిలక సరస్సులొ విహారం ఒక అద్భుతమైన అనుభవం.సరస్సు అంతర్భాగంలో ఉన్న నల్బన్ లాంటి దీవులకు (నల్బన్ ఒడ్డుకు 12కి.మీ.దూరం) వెళ్ళటం ఒక సాహసయాత్ర,రోమాంచకమైన అనుభవం(నేనింకా నల్బన్ వెళ్ళలేదండోయ్ స్నేహితులు అలా చెప్పారు,నేనూ త్వరలో వెళ్ళాలి). చిలకా లో చాలా దీవులున్నా ప్రముఖంగా ఆరేడు దీవులు సందర్శకులకు అనువుగా ఉంటాయి. చిలకా విహారం రంభానుంచికానీ,బార్కుల్ నుంచికానీ,బలుగాం నుంచికానీ ప్రారంభించవచ్చు.ఈ ప్రాంతాలలో ఆ ఏర్పాట్లు ఉంటాయి.మొన్న శనివారం మా కుటుంబమంతా కాళిజై ఐలాండ్ కి వెళ్ళాము.మా ప్రయాణం బార్కుల్ నించి ప్రారంభమైంది.ఇక్కడ ఒరిస్సా టూరిజంవారి రిసార్ట్స్,బోట్లు ఉన్నాయి.అయితే సీజన్ ఆఖరు కావటం వల్ల ఎక్కువమంది సందర్శకులు లేరు.ఒరిస్సా టూరిజం (OTDC) వారి బోట్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చవుతుంది.అందువల్ల ప్రైవేట్ బోట్ లోనే వెళ్ళాము.అయితే మీరు సీజన్లో కానీ వస్తే OTDC వారి బోట్ కే ప్రాధాన్యమివ్వండి.ఎందుకంటే వాటిలో అన్ని రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.వాళ్ళ పెద్ద బోట్ కయితే టికెట్ రేట్లు తీసుకుంటారు కాబట్టి ఖర్చుకూడ తక్కువే అవుతుంది.
బార్కుల్ నించి కాళీ జై సుమారు 4 కి.మీ. దూరం లో ఉంది.మేము తీసుకున్న బోటు చాలా విశాలంగా, అందంగా ఉంది.ఇరవైమంది వరకు కూర్చోవచ్చు.అయితేమేము కేవలం ఐదుగురిమి మాత్రమే. సరస్సు 12నుంచి 15 అడుగుల లోతు ఉంటుంది.స్వచ్చమైన నీళ్ళు నీలి రంగులో ఉన్నాయి.క్రింద నాచుమొక్కలున్న చోట లేత ఆకుపచ్చరంగులో కనిపిస్తున్నాయి.మరో నాలుగు బోట్లుకూడా మాబోటుతో కలిసి ప్రయాణించాయి.మధ్యలో రెండుబోట్లు మరోదారిలో వెళ్ళిపోయాయి.అవి సమీపంలోని లంక గ్రామాలకు వెళుతున్నాయని బోటు నడిపే అతని ద్వారా తెలిసింది.దారిలో బోట్లలో చేపలు పట్టేవాళ్ళు చాలామంది కనిపించారు.తక్కువ లోతు వల్ల వలలు వేసి చేపలు పట్టడం సులభం.ఆలా నీటిలో కాళిజై చేరటానికి అరగంట పట్టింది.కాళిజై ద్వీపంలో కాళీ మాత దేవాలయం ఉంది.ఈ అమ్మవారు చిలకా సరస్సును కాపాడుతుందని ఇక్కడి ప్రజల విశ్వాసం.దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆలయం వెనుక వైపు గుట్టపై,చెట్లమీద చాలా పక్షులు కనిపించాయి.వెనుతిరిగి వచ్చేటప్పుడు భారత నావికాదళ శిక్షణా కేంద్రం పక్కనుంచి వచ్చాము.మద్యలో గుట్టల పక్క రాళ్ళపై ఎక్కడ చూసినా పక్షులే కనిపించాయి.అవి మా పడవ అలికిడికి అవన్నీ ఒక్కసారిగా ఎగిరేవి.అది చూడటానికి ఎంతో అందమైన దృశ్యం.తిరుగు ప్రయాణానికి నలభై ఐదు నిమిషాలు పట్టింది.ఆ అనుభవాలు ముచ్చటించుకుంటూ ఇంటికి బయలుదేరాం.మా ప్రయాణం లో కొన్నిఫోటోలను ఇక్కడ పెడుతున్నాను చూడండి.మీరు సందర్శించుదామనుకునే ప్రాంతాలలో ఒరిస్సా లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలయిన పూరీ,కోణార్క్,లింగరాజ్ మందిరం,నందన్‌కానన్ పార్క్ లతో పాటు చిలకాను కూడా చేర్చుకోండి.ఆంధ్రానుంచి ఇక్కడకు చేరుకోవడం సులభం. విశాఖపట్నం హౌరా రైల్వే లైన్ లోనే ఉంది.విశాఖపట్నం నుంచి ట్రైన్లో 6 గం.ల ప్రయాణం మాత్రమే. రంభా,బలుగాం స్టేషన్లలో ఎక్కడయినా దిగవచ్చు.బార్కుల్ వెళ్ళాలంటే చిలకా స్టేషన్లోదిగాలి, అక్కడి నుంచి 2కి.మీ.రోడ్డు ప్రయాణం.రంభా,బార్కుల్ లలో ఒరిస్సా ప్రభుత్వ టూరిస్ట్ రిసార్ట్స్ ఉన్నాయి.ఖర్చుతక్కువ,శాటిస్ఫేక్షన్ గారంటీ.
చిలక సరస్సు విశేషాలు బాగున్నాయండీ.. ఆ ఊరికి ఆపేరు పేరు ఎలా వచ్చిందోగానీ? మన తెలుగు చిలకే నా?వేరే అర్ధముందంటారా? ఫోటోస్ బాగున్నాయండీ.. పక్షుల ఫోటోలు కూడా పెట్టవలసిందీ..
ReplyDeleteనైస్ పోస్ట్..
i too visited the lake a year back. its a wonderful n amazing experience.tarakesh
Deleteనా బ్లాగ్లో మీ కామెంట్ పట్టుకొని ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఈ చిలికా సరస్సు పోస్టు నాకు చాలా నచ్చింది. మీ అభిప్రాయాల వ్యక్తీకరణ బాగుంది. కానీ, ఒకసంవత్సరం నుంచి మీరు ఏమీ రాస్తున్నట్లుగా లేదు!
ReplyDeletedear sir ur telugu content very well sir
ReplyDeleteTelugu News