Search This Blog


Saturday, March 4, 2023

వైద్యో నారాయణో హరి

 వ్యాధి తో బాధ పడేవాళ్ళు "వైద్యో నారాయణో హరి" అని ఎంతో నమ్మకం తో వైద్యుల దగ్గరికి వెళ్తారు.కానీ ప్రస్తుత కాలం లో ఎంతమంది వైద్యులు భగవంతుని ప్రతి రూపాలుగా వైద్యం అందించగలుగుతున్నారూ అన్నది ప్రశ్న.
కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు మందుల తయారీ కంపెనీల వ్యాపార మాయాజాలం, వైద్యులలో పరస్పరం పోటీ, ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలలో ఉన్న తమ స్నేహితులతో తమ సంపాదనను పోల్చి చూసుకునే తత్వం కొందరు వైద్యులను ఫక్తు వ్యాపారులుగా మార్చేసాయి. చెయ్యి పట్టుకొని చూసేవాళ్ళు,లక్షణాలనుబట్టి మందులు రాసేవాళ్ళు అరుదు. అవసరం అయినవీ కానివి అన్ని టెస్టులూ రాయటం, ఆ తర్వాత కనీసం ఒక అరడజను మందులు రాయటం పరిపాటి. కేన్సర్ కే కాక చాలా వ్యాధులకి(బి పి,సుగర్ తో సహా) పూర్తిగా తగ్గించే మందులే లేవు.  
అందుచేత ఎవరికి వాళ్ళు ఆరోగ్యం జాగ్రత్తగా  కాపాడుకోండి. మంచి  ఆహార విహారాలు, నిద్ర, కల్మషం లేని మనసు మంచి ఆరోగ్యానికి దోహద పడతాయని మీకు తెలుసనుకోండి, కానీ మరోసారి గుర్తుచేస్తున్నాను.

Thursday, January 9, 2020

సత్యం

సత్యం పలకమని అన్ని మతాలు చెప్తున్నాయి. ఎదుటి వాళ్లు, అదీ మన నాయకులు నిర్లజ్జగా స్వప్రయోజనమే పరమార్దం గా అబద్దాలు చెప్తూంటే కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. సత్యమేవ జయతి అంటారు.  ఆ సత్యం తొందరగా వెలికి రానియ్యి భగవంతుడా!

Wednesday, March 16, 2011

చిలక సరస్సులో విహారయాత్ర-కాళీమాత దర్శనం

నేను ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉంటున్నాను.ఒరిస్సా కు వెనుకపడిన రాష్ట్రం అన్న అపప్రధ ఉంది.నేనూ ఇక్కడకు వచ్చేముందు చాలా భయపడ్డాను. ఒకప్పుడు వెనుక పడి ఉండేదేమో తెలియదు కానీ,ప్రస్తుతం మాత్రం ఆంధ్రకేమీ తీసిపోదు.ప్రజలు కూడా స్నేహశీలులు.దైవ భక్తి,ఆచారాలు చాలా ఎక్కువ. నిరాడంబరులు, పొదుపరులు, అల్పసంతోషులు. అద్భుతమైన ప్రకృతి సంపద ఒరిస్సాకు ఒక వరం. ఒరిస్సా భూభాగంలో 40% వరకు అడవులు విస్తరించుకొని ఉన్నాయి.ఒరిస్సాకు మరోప్రత్యేక ఆకర్షణ చిలక సరస్సు.ఈ సరస్సు మూడు జిల్లాల(గంజాం,ఖుర్దా,పూరీ) మేర విస్తరించి ఉంది.ప్రత్యెకంగా చెప్పుకో వలసిందేమిటంటే గంజాం,ఖుర్దా జిల్లాలలో తెలుగువారి సంఖ్య అధికం.చిలక సరస్సు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.సుమారు వేయి చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది.సుమారు నూట యాభై మత్స్యకార గ్రామాలు ఈ సరస్సుపై ఆధారపడి జీవిస్తున్నాయి. చిలకా ప్రపంచ ప్రఖ్యాత పక్షుల విడిది.చలికాలంలో ఖండ,ఖండాంతరాలనుంచి లక్షల సంఖ్యలో వివిధజాతుల(సుమారు నూట అరవై జాతులు) పక్షులు ఇక్కడికి వస్తాయి.వాటిని చూడటానికి సందర్శకులు కూడా ఎక్కువగానే వస్తారు.చిలకా సందర్శించటానికి అక్టోబర్ నుంచి మార్చి నెల వరకు అనువైన సమయం. చిలక సరస్సులొ విహారం ఒక అద్భుతమైన అనుభవం.సరస్సు అంతర్భాగంలో ఉన్న నల్బన్ లాంటి దీవులకు (నల్బన్ ఒడ్డుకు 12కి.మీ.దూరం) వెళ్ళటం ఒక సాహసయాత్ర,రోమాంచకమైన అనుభవం(నేనింకా నల్బన్ వెళ్ళలేదండోయ్ స్నేహితులు అలా చెప్పారు,నేనూ త్వరలో వెళ్ళాలి). చిలకా లో చాలా దీవులున్నా ప్రముఖంగా ఆరేడు దీవులు సందర్శకులకు అనువుగా ఉంటాయి. చిలకా విహారం రంభానుంచికానీ,బార్కుల్ నుంచికానీ,బలుగాం నుంచికానీ ప్రారంభించవచ్చు.ఈ ప్రాంతాలలో ఆ ఏర్పాట్లు ఉంటాయి.మొన్న శనివారం మా కుటుంబమంతా కాళిజై ఐలాండ్ కి వెళ్ళాము.మా ప్రయాణం బార్కుల్ నించి ప్రారంభమైంది.ఇక్కడ ఒరిస్సా టూరిజంవారి రిసార్ట్స్,బోట్లు ఉన్నాయి.అయితే సీజన్ ఆఖరు కావటం వల్ల ఎక్కువమంది సందర్శకులు లేరు.ఒరిస్సా టూరిజం (OTDC) వారి బోట్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చవుతుంది.అందువల్ల ప్రైవేట్ బోట్ లోనే వెళ్ళాము.అయితే మీరు సీజన్లో కానీ వస్తే OTDC వారి బోట్ కే ప్రాధాన్యమివ్వండి.ఎందుకంటే వాటిలో అన్ని రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.వాళ్ళ పెద్ద బోట్ కయితే టికెట్ రేట్లు తీసుకుంటారు కాబట్టి ఖర్చుకూడ తక్కువే అవుతుంది.
బార్కుల్ నించి కాళీ జై సుమారు 4 కి.మీ. దూరం లో ఉంది.మేము తీసుకున్న బోటు చాలా విశాలంగా, అందంగా ఉంది.ఇరవైమంది వరకు కూర్చోవచ్చు.అయితేమేము కేవలం ఐదుగురిమి మాత్రమే. సరస్సు 12నుంచి 15 అడుగుల లోతు ఉంటుంది.స్వచ్చమైన నీళ్ళు నీలి రంగులో ఉన్నాయి.క్రింద నాచుమొక్కలున్న చోట లేత ఆకుపచ్చరంగులో కనిపిస్తున్నాయి.మరో నాలుగు బోట్లుకూడా మాబోటుతో కలిసి ప్రయాణించాయి.మధ్యలో రెండుబోట్లు మరోదారిలో వెళ్ళిపోయాయి.అవి సమీపంలోని లంక గ్రామాలకు వెళుతున్నాయని బోటు నడిపే అతని ద్వారా తెలిసింది.దారిలో బోట్లలో చేపలు పట్టేవాళ్ళు చాలామంది కనిపించారు.తక్కువ లోతు వల్ల వలలు వేసి చేపలు పట్టడం సులభం.ఆలా నీటిలో కాళిజై చేరటానికి అరగంట పట్టింది.కాళిజై ద్వీపంలో కాళీ మాత దేవాలయం ఉంది.ఈ అమ్మవారు చిలకా సరస్సును కాపాడుతుందని ఇక్కడి ప్రజల విశ్వాసం.దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆలయం వెనుక వైపు గుట్టపై,చెట్లమీద చాలా పక్షులు కనిపించాయి.వెనుతిరిగి వచ్చేటప్పుడు భారత నావికాదళ శిక్షణా కేంద్రం పక్కనుంచి వచ్చాము.మద్యలో గుట్టల పక్క రాళ్ళపై ఎక్కడ చూసినా పక్షులే కనిపించాయి.అవి మా పడవ అలికిడికి అవన్నీ ఒక్కసారిగా ఎగిరేవి.అది చూడటానికి ఎంతో అందమైన దృశ్యం.తిరుగు ప్రయాణానికి నలభై ఐదు నిమిషాలు పట్టింది.ఆ అనుభవాలు ముచ్చటించుకుంటూ ఇంటికి బయలుదేరాం.మా ప్రయాణం లో కొన్నిఫోటోలను ఇక్కడ పెడుతున్నాను చూడండి.మీరు సందర్శించుదామనుకునే ప్రాంతాలలో ఒరిస్సా లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలయిన పూరీ,కోణార్క్,లింగరాజ్ మందిరం,నందన్‌కానన్ పార్క్ లతో పాటు చిలకాను కూడా చేర్చుకోండి.ఆంధ్రానుంచి ఇక్కడకు చేరుకోవడం సులభం. విశాఖపట్నం హౌరా రైల్వే లైన్ లోనే ఉంది.విశాఖపట్నం నుంచి ట్రైన్లో 6 గం.ల ప్రయాణం మాత్రమే. రంభా,బలుగాం స్టేషన్లలో ఎక్కడయినా దిగవచ్చు.బార్కుల్ వెళ్ళాలంటే చిలకా స్టేషన్లోదిగాలి, అక్కడి నుంచి 2కి.మీ.రోడ్డు ప్రయాణం.రంభా,బార్కుల్ లలో ఒరిస్సా ప్రభుత్వ టూరిస్ట్ రిసార్ట్స్ ఉన్నాయి.ఖర్చుతక్కువ,శాటిస్ఫేక్షన్ గారంటీ.








Sunday, February 13, 2011

మనం తెలుగు బ్లాగుల్ని ఎటు తీసుకుపోతున్నాం?

     అంతర్జాలం మనకు ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి ఈ బ్లాగులు.తెలుగులో బ్లాగు నడపగలుగుతున్నారంటే తప్పనిసరిగా విద్యావంతులు,కాస్తో కూస్తో కంప్యూటర్ మీద పట్టు ఉన్నవాళ్ళూ,తెలుగు మీద అభిమానం, తెలుగు వారి సంస్కృతి మీద అభిమానం ఉన్న వాళ్ళూ,విజ్ఞులు  అయిఉంటారని నా అభిప్రాయం.నేను బ్లాగు మొదలెట్టి నిండా సంవత్సరం కాలేదు.అయితే ఈ కొంత కాలం లోనే కొన్ని అద్భుతమైన బ్లాగులను చూసాను,అవి చూస్తే ఆ బ్లాగర్ ల అభిలాష,విషయ పరిజ్ఞానం,విషయ సేకరణ వెనుక వాళ్ళ కృషి చెప్పకనే తెలుస్తుంది.అలాంటి మేధావుల నుంచి, అనుభవజ్ఞుల నుంచి ఎంతోనేర్చుకోవచ్చనిపిస్తుంది.అది నిజం కూడా.ఆయితే దురదృష్టవసాత్తు కొన్నిసంఘటనలవల్ల కొంతమంది బ్లాగర్ల మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.ఇవి కుటుంబ సభ్యులను దూషించటం , ఆలాగే కొన్ని కోట్లమంది ఆరాధింఛే దైవాలను దూషించి, ఇతిహాసాలకు కూడా వక్రభాష్యం చెప్పే స్థాయికి చేరిపోయాయి.ఇలాంటి పోస్ట్ ల సంఖ్య క్రమేపీ పెరిగిపోతుంది.దీనివల్ల ఆ బ్లాగర్లు ఆశించినది నెరవేరుతుందోలేదో కానీ మిగిలిన బ్లాగర్ ల మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయి.వాళ్ళకు వేదన మిగిల్చుతున్నాయి.ఇదేనా భాధ్యత కలిగిన తెలుగువారినుంచి ఆశించగలిగేది. మనం మన తరవాతి తరాలకు అందించే బహుమతి ఇదా.ఇలాంటి సంఘటనలవల్ల చాట్ రూంలకి అధోగతి పట్టింది.బ్లాగులకి ఆ గతి పట్టకుండా కాపాడుకోవలసిన అవసరం ఉంది.
వాస్తవానికి ఏ యుధ్ధం లోనూ విజేత ఉండడు(దు).గెలిచినవారికి, లేదా గెలిచామనుకున్న వారికి కూడా అప్పటికే చాలా గాయాలు తగిలి ఉంటాయి.అవి నిరంతరం గుర్తుకువచ్చి వేధిస్తూనే ఉంటాయి.అందుకే యుధ్ధాన్ని నివారించటమే ఉత్తమ మార్గం,యుధ్ధం ఇప్పటికే మొదలైంది కాబట్టి తక్షణం విరమించటం మంచిది.

క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః! 
స్మృతి భ్రంసాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి!
(ఇది మీకందరికీ తెలిసిన శ్లోకమే,మరోసారి గుర్తుచేస్తున్నానంతే) 

అనుద్వేగకరం వాక్యం 
సత్యం ప్రియహితంచయత్! 
స్వాధ్యాయభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే!
(ఇతరుల మనస్సుకు భాధ కలిగించనిది,సత్యమైనది,ప్రియమైనది, మేలుకలిగించునది అయిన వాక్యము పలుకుట వేదములను, శాస్త్రములను, అభ్యసించుటవలె వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది)

బ్లాగర్లు అందరికీ ఇదే నా విన్నపం. దయ చేసి అంతా సంయమనం పాటించండి.తెలుగు బ్లాగుల ప్రతిష్ట పెంచండి.

Saturday, February 12, 2011

ఎల్లోరా గుహలు-భారతీయుల ప్రతిభకు ఒక నిదర్శనం(మరిన్ని ఫోటోలతో)

   మీలో చాలా మంది ఎల్లోరా చూసి ఉంటారు.చూసిన వాళ్ళకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత అక్టోబర్ నెలలో షిరిడి సాయి బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాము.అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలన్నీ చూడటం జరిగింది.శని శింగణాపుర్,నాసిక్,ఇతర దేవాలయాలతోపాటు ఎల్లోరా గుహలు కూడా చూసాము.అజంతాకి కూడా వెళదామనుకున్నాము కానీ ఆ రోజు అజంతాకు శెలవు రోజు కావటం వల్ల చూడలేకపోయాము.ఎల్లోరా శిల్ప నైపుణ్యం నన్ను ఆశ్చర్య పరిచింది.అది ఒక కొండను పైనుంచి తొలుచుకుంటూ క్రిందికి నిర్మించిన నిర్మాణం. కైలాసమందిరం అద్భుతంగా ఉంటుంది.ఇది కాక చాలా గుహలు ఉంటాయి.దీనిని క్రీ.శ.6 నుంచి 10 శతాబ్ధాల మధ్య, చాళుక్య రాష్ట్రకూట రాజుల  సారధ్యంలో నిర్మించటం జరిగింది.అలాంటిది నిర్మించాలంటే ఈ నాటికీ మనకు అందుబాటులోలేని సాంకేతిక పరిజ్ఞానమేదో వాళ్ళకి అందుబాటులో ఉండి ఉండాలి.నిర్మాణం ప్రారంభించటానికి ముందే ఆ కొండను స్కాన్ చేసి లోపల రాతి స్వభావం,ఆకృతి పరిశీలించి ఉండాలి.లేకపోతే ఆ నిర్మాణం ప్లాన్ గీయటం ఎలా సాధ్యపడుతుంది.

    ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని సంరక్షిస్తోంది.దాని సంరక్షణతో సరిపెట్టుకోకుండా దానివెనుక ఉన్న సాంకేతిక విలువలను కూడా వెలుగులోనికి తీసుకు రావాలి.ఇవేకాకుండా కోణార్క్ సూర్యదేవాలయం, తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మాణాలు కూడా ఇప్పటికీ భారతీయుల సాంకేతిక ప్రతిభకు నిదర్శనమైన అద్భుతాలుగా మిగిలిపోయాయి.నేను తీసిన కొన్నిఫోటోలను కూడా పెడుతున్నాను చూడండి.ఈ సారి ముంబాయి కాని,పూనే కానీ, షిరిడి కానీ వెళితే ఎల్లోరా వెళ్ళండి.అయితే సోమ మంగళ వారాలలో వెళ్ళారంటే అజంతాఎల్లోరాలలో ఏదో ఒకటే చూడగలుగుతారు.




















Sunday, February 6, 2011

ఎల్లోరా గుహలు-భారతీయుల ప్రతిభకు ఒక నిదర్శనం

   మీలో చాలా మంది ఎల్లోరా చూసి ఉంటారు.చూసిన వాళ్ళకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత అక్టోబర్ నెలలో షిరిడి సాయి బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాము.అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలన్నీ చూడటం జరిగింది.శని శింగణాపుర్,నాసిక్,ఇతర దేవాలయాలతోపాటు ఎల్లోరా గుహలు కూడా చూసాము.అజంతాకి కూడా వెళదామనుకున్నాము కానీ ఆ రోజు అజంతాకు శెలవు రోజు కావటం వల్ల చూడలేకపోయాము.ఎల్లోరా శిల్ప నైపుణ్యం నన్ను ఆశ్చర్య పరిచింది.అది ఒక కొండను పైనుంచి తొలుచుకుంటూ క్రిందికి నిర్మించిన నిర్మాణం. కైలాసమందిరం అద్భుతంగా ఉంటుంది.ఇది కాక చాలా గుహలు ఉంటాయి.దీనిని క్రీ.శ.6 నుంచి 10 శతాబ్ధాల మధ్య, చాళుక్య రాష్ట్రకూట రాజుల  సారధ్యంలో నిర్మించటం జరిగింది.అలాంటిది నిర్మించాలంటే ఈ నాటికీ మనకు అందుబాటులోలేని సాంకేతిక పరిజ్ఞానమేదో వాళ్ళకి అందుబాటులో ఉండి ఉండాలి.నిర్మాణం ప్రారంభించటానికి ముందే ఆ కొండను స్కాన్ చేసి లోపల రాతి స్వభావం,ఆకృతి పరిశీలించి ఉండాలి.లేకపోతే ఆ నిర్మాణం ప్లాన్ గీయటం ఎలా సాధ్యపడుతుంది.
    ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని సంరక్షిస్తోంది.దాని సంరక్షణతో సరిపెట్టుకోకుండా దానివెనుక ఉన్న సాంకేతిక విలువలను కూడా వెలుగులోనికి తీసుకు రావాలి.ఇవేకాకుండా కోణార్క్ సూర్యదేవాలయం, తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మాణాలు కూడా ఇప్పటికీ భారతీయుల సాంకేతిక ప్రతిభకు నిదర్శనమైన అద్భుతాలుగా మిగిలిపోయాయి.నేను తీసిన కొన్నిఫోటోలను కూడా పెడుతున్నాను చూడండి.ఈ సారి ముంబాయి కాని,పూనే కానీ, షిరిడి కానీ వెళితే ఎల్లోరా వెళ్ళండి.అయితే సోమ మంగళ వారాలలో వెళ్ళారంటే అజంతా, ఎల్లోరాలలో ఏదో ఒకటే చూడగలుగుతారు.